Tuesday, May 19, 2015

అశాంతి పర్వం

అస్సాము శాంతి అంతంతమాత్రం – ఒరిసా కూడా అంతే  ఘోరం
బెంగాలు చూస్తే బెడదే పాపం – కాశ్మీరు మొత్తం దడ దడ వైనం
అల్లాడించే ఉగ్రవాదము - అల్లా రక్ష అంతే యోగం
ఆంధ్రా రాష్ట్రం అంతర్కలహం – ఆందోళనల అంతర్మదనం
కీచులాటలో నీటి పంపకం - నాకేం తెలుసు నీదీ రాజ్యం
విదేశియాత్రలు సఫలం సఫలం – సరిహద్దుల్లో ఆగదు సమరం
అక్కడి వాళ్లకి అభయాస్తం - ఇక్కడి వాళ్ళను యిగరేస్తాం

                                    య.వెంకటరమణ

Friday, May 15, 2015

చిన్నాపెద్దా ఒకటే..

తికమిక పడకో అమ్మడు
తెగ వేదన పడకో తమ్ముడు
చిన్నాపెద్దా ఒకటే..
మరి తేడాలంతగ లేవు.

డేటింగులంటూ లేచిపోవటం,
డైటింగులంటూ పస్తులుండడం.
ఉన్న గుడ్డలు చింపుకోవటం,
పేషన్లంటూ తిరుగులాడడం.
ఒకటే ఒకటే తమ్ముడు
మరి తేడాలెందుకు అమ్మడు

చింపిరీకలు గాలికొదలడం ,
చింపిరిగుడ్డలు సిగ్గుగప్పటం.
పచ్చిపులుసులో ముంచుకోటం,
పానీపూరీ పోజులివ్వడం.
ఒకటే ఒకటే తమ్ముడు
ఊరకె ఫోజులు అమ్మడు

బ్రెడ్డుముక్కలో పచ్చికూరలు,
బర్గర్ పేషన్ బడా బాబులు .
అజీర్తిరోగం అయ్యోపాపం,
రాగి సంగటి,డైటింగ్ డైటింగ్.
తికమక పడకో తమ్ముడు,
తుదకంతా ఒకటే తమ్ముడు.

గంజీ ఉప్పూ కలిపితాగడం,
సూపని చెప్పి మురిసిపోవడం.
తిండి కోసమని పరుగులెట్టడం,
తిన్నదరగక పరుగుదీయడం.
ఒకటే ఒకటే తమ్ముడు,
మరి తేడాలెందుకు అమ్మడు.


...........య.వెంకటరమణ

Thursday, May 14, 2015

అఖండ భారతదేశం

ముస్లీములిక్కడ,క్రైస్తవులిక్కడ,
సిక్కులిక్కడా, హిందువులిక్కడ.
నాయుడ్లాళ్ళు , రాయుడ్లాళ్ళు
బ్రహ్మణుళీళ్ళు , వైష్ణవుళాళ్ళు
కాపోళ్ళాళ్ళు , కమ్మోళ్ళీళ్ళు .

ఒక్కడు లేడే  భారతీయుడు
అయ్యో పాపం భారతదేశం.
భారత దేశం–ఇదిమన దేశం.
కులాన్ని బట్టి జాతి గౌరవం
జాతి మధ్యలో మతాల వైరం

మరిచేదెపుడు?మారేదెపుడు?
మనమందరము కలిసేదెపుడు?
మౌళిక విలువల లోపం,లోపం.
మౌళిక తంత్రం-ఇది గణతంత్రం!

మతాలు  బట్టి మారేటి చట్టం
కులాలవారీ ఇంకో ఘట్టం
తల్లి పేరుకు వారసులేరి?
ఇది మన దేశం-భారతదేశం!

..............య.వెంకటరమణ

Friday, May 1, 2015

యువత

యువత నీవు,శక్తి నీవు,సమాజపు వెలుగునీవు.
నీ అడుగే వెలుగు బాట-నీవేనోయ్ క్రాంతి బాట.
సమాజాన వెలుగు నీవు-సమాజమే నీవు నీవు.
నీదేనోయ్ దేశమంటే-నీవేనోయ్ దేశమంటే,
దేశమంటే నీవేనోయ్-దేశం మరి నీవేనోయ్
కలలు గనే  భరతమాత,ముద్దుబిడ్డ నీవు నీవు.
కదం కదం నీవు కలుపు.కదం నీది మేలుకొలుపు.
న్యాయస్థాపనాయాగం,అశ్వమేధమే నీవు.
అన్యాయాన్నెదిరించే  బ్రహ్మాస్త్రం నీవు నీవు.
లంచగొండు తనం పైన  యుద్ధభేరి మ్రోగించే,
జనశక్తివి,యువశక్తివి,భరతమాత భుజశక్తివి.
వెలుగుబాట యాగంలో ఎలుగెత్తే స్వరం నీవు
అల్లూరీ విల్లు నీవు, ఆ వీరుల ఛాయ  నీవు.
కలలు గనే  భరతమాత,ముద్దుబిడ్డ నీవు నీవు.
కదం కదం,కదం కలుపు.కదం నీది మేలుకొలుపు.
పద పదా స్థాపిద్దాం - ప్రజాహితా సామ్రాజ్యం
ప్రజాహితా సామ్రాజ్యం- భ్రష్ట రహిత సామ్రాజ్యం
పద పదా  స్థాపిద్దాం - ప్రజాహితా సామ్రాజ్యం!!

................................య.వెంకటరమణ