Friday, December 18, 2015

పద్మ భూషణ్ బోయి భీమన్న గారు


తెలుగు రచన 12:24am Dec 16
“ఏ రమణి మకుట లీలా మంజరీ ద్యుతమొ
ఏ అసంస్కృత కుంతలా యధాతధ చ్యుతమొ
ఎత్తవోయీ కేల ఈ బేల సుమబాల”
- బోయి భీమన్న
***

మహాకవి,కళాప్రపూర్ణ, పద్మవిభూషణ్, భావ విప్లవకవి, అత్యద్భుత శృంగార కావ్య విరచిత బోయి భీమన్న గారి వర్ధంతి సందర్భమంగా వారికి నివాళి ఘటిస్తూ స్మృత్యంజలి ……

యలమంచలి వెంకట రమణ (తెలుగు రచన)

***

నాటక కర్తగా, గేయకర్తగా, కవిగా, పీఠికా రచయితగా, పత్రికా సంపాదకులుగా తనకంటు ప్రత్యేకమయిన, విశిష్టమయిన స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప సాహితీ వేత శ్రీ బోయి భీమన్నగారు. ఆదికవి వాల్మీకి, ధర్మవ్యాధుడు, వేదవ్యాసుడు, రాగవాశిష్టం లాంటి పౌరాణిక నాటకాలే కాక రాగవైశాఖి లాంటి శృంగార కావ్యాన్ని కూడా తనదైన శైలిలో అధునిక భావంతో , భావ విప్లవ దృష్టితో వ్రాసి అశేష ప్రజానికాన్ని మెప్పించారు బోయి భీమన్న. అంతే కాక "హరిజనులు ఆర్యులే " అన్న విషయాన్ని ప్రతిపాదించి నొక్కి వక్కాణించారు..

రచయిత, కవి, నాటకకర్త, దార్శినికుడు పద్మభూషణ్ డాక్టర్ బోయి భీమన్న. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో 1911 సెప్టెంబర్ 19 న జన్మించారు , వీరి రచనలు పాలేరు,జన్మాంతర వైరం, రాగవాశిష్టం, గుడుసెలు కాలిపోతున్నాయి, పంచమస్వరం ఆకాలంలో హరిజనుల పోరాటానికి పునాది వేశాయి. తొలిసారిగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా తరువాత వివిధ పత్రికల్లో పాత్రికేయుడిగా చేస్తూ తొలితరం పాత్రికేయులుగా ప్రసిద్ధికెక్కారు. గుడిసెలు కాలిపోతున్నాయి గ్రంధానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ లభించింది. 2001 లో భారత ప్రభుత్వం భీమన్న గారిని పద్మభూషన్ అవార్డ్ తో సత్కరించింది.

2005 డిసెంబర్ 16 న భీమన్న గారు స్వర్గస్తులయ్యారు.

బోయి భీమన్న గారి నాటకాల గురించి క్లుప్తంగా:

రాగవాశిష్టం:

రాగవాశిష్టం 1959 లో వెలువడిన నాటకం భాగవత బ్రహ్మ వైవర్ణ పురాణల్లోని అరుంధతి , వశిష్టులకు సంభందించిన సంఘటనలే ఈ నాటక కథకు మూలం. అరుంధతి, వశిష్టుల వివాహం జరిగిన తీరు గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. తాను ప్రేమించిన అరుంధతి కులం తెలిశాక ఆమెకు దూరమవుతాడు వశిష్టుడు. ఆ తర్వాత విరహం భరించలేక పశ్చాత్తాపపడి, ఆమె దగ్గరకు వెళతాడు. అయితే ఆ లోగానే అమె తన తపస్సులో నిమగ్నమై ఉంటుంది. ఈ తపోగ్ని తాపానికి అక్కడ అంతా మండిపోయి కరువు కాటకాలు ఏర్పడతాయి. వశిష్టుడి తపోవనంలో కూడా తిండిలేక నీరు లేక ప్రజలు బాధలు పడుతూ ఉంటారు. ఇక ఈ కష్టాలు తాళలేక వీరంతా బ్రహ్మ దగ్గరకి వెళ్ళి తమ కష్టాలు కడతేర్చమని విన్నవించుకుంటారు. అప్పుడు ఆ ఈశ్వరుడే అరుంధతి ఆశ్రమానికి వస్తాడు. పశ్చాత్తాపం చెందిన వశిష్టుడు అప్పటికే ఆ ఆశ్రమానికి వచ్చి ఉంటాడు. అయితే ప్రాచీనుడు, ఇంకా ఇతర పూర్వాచార నిష్టులు అరుంధతి , వశిష్టుల వివాహాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. శివుడి వీరికి బుద్ధి చెప్పి వారిరువురికి పెళ్ళి జరిపిస్తాడు. ఇది పౌరాణిక ఇతివృత్తం అయినా దీనికి కాస్త అధునిక పోకడలను అద్ది, ఇందులోని సన్నివేశాలని అప్పటి పరిస్థితులకి అనుగుణంగా సాంఘీక నాటక రీతిలో భీమన్న గారు తీర్చిదిద్దారు.

రాగ వైశాఖి:

రాగ వైశాఖి ఒక మహత్తర శృంగార కావ్యం.నవ రసాలలో ఆది నుండి కవిలోకం అగ్రస్థానమే యిచ్చింది. శృంగారానికి ఆలోచనా స్రవంతిని లేఖల ద్వారా రసరమ్యంగా అక్షర రూపం దాల్చిన కావ్యం. శృంగార రసాబ్దిలో తెలియాడుతూ, అలోచనా తరంగాల ప్రకంపనలలో మునిగి తెలే రససాగరమే ఈ రాగ వైశాఖి

ఈ రాగ వైశాఖం నుండి కొన్ని ఆణిముత్యాలు

" దీన్ని తెలుసుకొంటే లోకంలో మరి దేన్ని తెలుసు కొనవసరము లేదు, ఆపరమ జ్ఞానమే పరిపూర్ణబ్రహం దీన్ని చూస్తే లోకంలో మరి దేన్ని చుడనవసరములేదు--అపరమసౌందర్యమేనీవు అంతా నీవు -ఇప్పుడు నాకు నీపెదవులపై అచిరునవ్వు, నీకన్నులలో ఆ కాంతి, నీకంఠంలో ఆ ప్రణయనాదం-- ఇదే జ్ఞానం, ఇదే సౌందర్యం ఈ సౌందర్య జ్ఞానసమద్వైతమే నీవు నాకు నీవే విహారపరిధివి, నాకు నీవే శృతి కేంధ్రానివి "

" క్రొత్త వాళ్ళం కాము మనం జీవన స్రవంతికి ఎదురు బొదురు తీరాల వెంట, ఎంత దూరం నుంచి, ఎంత కాలంగా ప్రయాణం చేస్తూ వస్తున్నామో మనం ఒకటై పొయాము ఆత్మదాకా, అందుకే ఈ భావైఖ్యత. నాకులాగే -ఎనూఅ లేఖలు వ్రాసి చింపేసావు కదూ. ఆ ముక్కలు ఎక్కడ పొశావో అవి గులాబి మొక్కలై మొలిచి ఉంటాయి మొగ్గలు కూడా తొడిగి ఉటాయి. ఆ 'పువ్వులు' నీ చిరు నవ్వుల్లా గుభాళిస్తాయి ఈ లేఖలోని గులాబి రేకలు అవేకావు కదా! వైశాఖి. "

"నీవు ఒక పరమ అనుభూతివి నాకు. గంగకు ఉపనది యమున, గోదావరికి వైనతేయం కృష్ణుడు పసువుల కాపరి నేనూ పసువుల కాపరినే, చిన్నప్పుడు అతడిది యమునాతీరంలో బృందావనం, నాది వైనతేయతీరంలో రసాలవనం కృష్ణ మంత్రాధి దేవత రాధ, రాధకృష్ణ భావం నాకెందుకిపుడు. స్వభావం లేనపుడు కదా పరభావారోహణ. వ్యక్తినీ వ్యక్తియెక్క అనుభూతిని నిరూపించి చూపటముకొసమే ఈ పొలిక అనుభూతి ఎక్కడైనా ఒక్కటే దేశకాల ప్రాంతాలకనుగుణంగా అభివ్యక్తమవుతుంది మేఘామూ అదే వర్షమూ అదే పూరుషూడూ అదే ప్రకృతి అదే ఆనంద పారవశ్యం. నీవు నాకు రాగవైశాఖివై నీవు రాగానే పూర్ణవసంతుణ్ణై నిల్చాను నేనిప్పుడు -ఈ రసాలవనం లొ ఈవైనతేయంతీరంలో “

“జీవితం ఒక నిరంతర ఘర్షణ అపజయాలు కారాకులుగా రాలిపొతూ విజయాలు మారాకులుగా మొలకలెత్తుతూ ముందుకుసాగిపొతుంది జీవన లత జయాపజయాల నిత్యఘర్షణే ఈ మానవయాత్ర. ఎదుకు భయం దీనిని చూచి, అసలు మనం పుట్టిందే ఒక ఘర్షణ నుంచి, ఘార్షణ చైతన్య మూలం, చైతన్యం ఒక స్రవంతి . “
ఏభావ ఘాట్టానా జనిత రూపరేఖలమొ మనం-
ఈస్రవంతిలొ ఏఇచ్చా చాలిత నాదస్వర కల్పనలమొ మనం--
ఈవిశ్వం పై శివశక్తులం మనం
మన ప్రణయ మే నాదం మనచుంబనమే బిందువు
తత్ఫలితమే కళ కళారుపులం మనం
సుఖదుఖాలు, మంచి చెడ్డలు , చీకటి వెలుగులు ,
నిమ్నోన్నతాలు ,ముందు వెనుకలు -
ఇవన్ని ఎడాపెడా కొడుతూ ఉండగా
రెండు శిలల ఒరిపిడిలొ స్పులింగంవలెపుట్టి ప్రజ్వలితమై పురొగమిస్తుంది
జీవితం నిరంతర ఘర్షణా సముపార్జిత విజయమే పురొగమనము

“కాళ్ళూ గతం లోనూ తల భవిష్యత్తు లోనూ ఉంటుంది లోకంలొ ఎక్కువ మందికి మొండెం మాత్రం వర్తమానం లో బ్రతుకుతుంది ఆకాళ్ళకి ఎంతొమురికి ఆమురికి వర్తమానమే భరించలేదు ఇక భవిష్యత్తు ఎక్కడా అందుకని మొండెం మాత్రమే సాగుతుంది వర్తమానం పొడుగునా అదే పురొగమనం ఆంటుంది భవిష్యత్తు లోని తల తరించి తరింప జేయమంటుంది మన ధర్మం ఎవరూ ఎవర్ని తరింప జేయలేరు తనకుతాను తరింస్తే చాలు తనను తాను తెలుసుకొటవటమే తరించటం ఆందుకు ఆపాద మస్తకము వర్తమానం లో బతకాలి “

“ఏ ఆచ్చాదన లేనందు వల్లే అప్పుడప్పుడూ లోకం విసిరే మురికి, గుచ్చే ముళ్ళూ, చల్లే నిప్పులు హృదయం దాకా తగిలి భాధిస్తాయి లోకములొ బతకాలనుకునేవారికి ఏదొ ఒక కవఛం ఉండక తప్పదు .”
నగ్నసత్యం వేదాంతం, అలంకృత సత్యం, కవిత్వం అంటారు బోయి భీమన్నగరు రాగ వైశాఖిలో.
***
అలాగే ఆదికవి వాల్మీకి, ధర్మవ్యాధుడు, పౌరాణిక ఇతివృత్తాలయినప్పటికినీ, తన భావాలకు అనుగుణంగా, భావంలోను, భాషలోను, అధునికతను కనబరుస్తూ మహాభారతానికి సంభంధించిన ఇతివృత్తాన్ని తీసుకుని నాటక రచనలు చేసినా నేటి సమాజంలోని అనేక రుగ్మతల్ని , అహేతుక సంప్రదాయలని నిశితంగా విమర్శిస్తూ పురాణ కథలను తన ప్రతిభా పాటవాల్తో అధునికం చేశారు బోయి భీమన్నగారు. విప్లవాత్మక సునిశిత దృష్టి వీరి సొంతం. మొదటినుండి వీరు ఒక వ్యక్తిగా, సాహిత్యకర్తగా, బానిసత్వాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. అందుకు ఉదాహరణగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ గెలుచుకున్న పాలేరుని ఊటంకించవచ్చు. ఈ పాలేరు కథాంశం బానిసత్వాన్ని వ్యతిరేకించడమే. అలాగే తన మరో నాటకంలో వ్యాసుడు చేత ఈ బానిసత్వాన్ని వ్యతిరేకతని చెప్పిస్తారు. వ్యాసుడి వంశక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని అతని చేత అభ్యుదయ భావాల్ని వెల్లడించడం ద్వారా భావ విప్లవాన్ని సృష్టించారు బోయి భీమన్నగారు.

డిసెంబర్ 16 బోయి భీమన్నగారి వర్ధంతి సందర్భంగా వారికి అంజలి ఘటిస్తూ ఈ చిరు అక్షరారధన

మీ
యలమంచిలి వెంకట రమణ (తెలుగు రచన)

***