Wednesday, July 1, 2015

కథలు వ్రాయనా నేను?

===========================
కథలు వ్రాయనా  నేను, కథలు వ్రాయనా?
కన్నీటి శోకాలను కలంజేసి,కథలు వ్రాయనా?
కడుపునిండినాకలిని,కన్నీళ్ళతో నింపుకునే,
కడదేరని కథలన్నీ,పోగుజేసి నేను వ్రాయనా?
కథలు వ్రాయనా  నేను, కథలు వ్రాయనా?

కూటికి నోచుకోక, కాటిలోన చోటులేక.
ఆదారి మధ్యలోన,నిరాదార శవాలను,
పేర్చిజేర్చి కథలు వ్రాయనా,కథలు వ్రాయనా?
జనాభాకు లెక్కరాక, జనం మధ్య చోటులేక,
ఊరు బయట కుక్కలతో, ఆ చెత్త కుప్పలతో,
అదోజాతి ప్రాణిలాగ అలమటించు ఆ మనుషుల
కథలుపేర్చి కథలు కథలుగా, కథలు వ్రాయనా?
 
రెక్కాడిన డొక్కాడని ఆ బక్కా ప్రాణులను
కర్కోటపు కోరలతో నొక్కి చంపు కామందుల
కథలు విప్పి,కథలు వ్రాయనా,కథలు వ్రాయనా
నిర్దోషుల దోషాలను నిలదీసే అన్యాయం
దోషులకు దాసోహం దేశచరిత వైబోగం
కట్టల గుట్టలలో ఊపిరాడనీ న్యాయం
ఓరకంట  భారతం విడమరిసి నేను వ్రాయనా?

వందుంటే పాతికప్పు,పొలముంటే పంటకప్పు
ఏదీ లేని జనాలకు ఏమున్నది నువ్వు చెప్పు?
చెప్పు చెప్పు నీవు చెప్పు. ఏమి వ్రాయనోజెప్పు
ఎలా వ్రాయనో చెప్పు, ఏమి వ్రాయనో నీవుజెప్పు.

కథలు వ్రాయనా  నేను, కథలు వ్రాయనా?
కన్నీటి శోకాలను కలంజేసి,కథలు వ్రాయనా?
కడుపునిండినాకలిని,కన్నీళ్ళతో నింపుకునే,
కడదేరని కథలన్నీ,పోగుజేసి నేను వ్రాయనా?
కథలు వ్రాయనా  నేను, కథలు వ్రాయనా?
============================

................................య.వెంకటరమణ

No comments:

Post a Comment