Sunday, September 18, 2022

పిడక దాపున మరగ కాగి ఎరుపు దేరిన పాల మీగడ

Telugu rachana
2072
18/09/2022
================
పిడక దాపున మరగ కాగి
ఎరుపు దేరిన పాల మీగడ
గడ్డ పెరుగు సద్దియన్నం 
ఆవకాయ ముక్క తాయం

ఉడకబెట్టిన వడ్లు దంచి
వండి పెట్టిన ఉప్పుడన్నం
పప్పు ముద్ద పైన వెన్న
ఇంగువేసిన ఇంత చారు

నాయనమ్మ బొబ్బరట్లు
పాల కోవా తేనె పట్లు
ఉప్పుడన్నం గంజిలోన 
పుల్ల గింత నిమ్మరసము

నానబెట్టిన తెల్ల అటుకులు
నాన్న తెచ్చిన ముంజు కాయలు
కోరు దేసిన పాతబెల్లం
తవ్వి తీసిన తేగ ముక్కలు 

కాటుకద్దిన బెదురుకళ్ళు
పసుపు రుద్దిన స్వర్ణవదనం
పరికిణీలో పడచులందం
పలుకరింపుల సంప్రదాయం

పూజ గదిలో అవ్వ పూజలు
అమ్మ చేతి మట్టి గాజులు
తులసి కోట అలుకు ముగ్గులు
మువ్వ పట్టీ చెల్లి ఆటలు

చంటి గాడి లాగు చొక్కా
నిమ్మ తొనలకు ఐదు పైసలు
పుల్ల అయిసు పదే పైసలు
పావలా మరి షావుకారు

మట్టి పలక తెల్ల కణిక
పేక బెత్తెం గోడ కుర్చీ
సగం బెల్లు పెంకులాటలు
కాకి ఎంగిలి చాకిలెట్లు

పండగొస్తే పబ్బమొస్తే
పసుబ్బొట్టు కొత్త బట్టలు
గమిడి పూజలు తోరణాలు
పిండి వంటల గుబాళింపులు

కొప్పు చుట్టూ బట్ట చుట్టి
మోజేతి వరకు పసుపులద్ది 
ఆకు పరిచి అన్నమెట్టే  
అమ్మ చేతి మధురిమాలు

గురుతుకొస్తున్నాయ్
గురుతుకొస్తున్నాయ్
గురుతులే ఇక మిగిలిపోతున్నాయ్
గురుతులూ ఇక చెరిగిపోనున్నాయ్
================
     య. వెంకటరమణ/..

No comments:

Post a Comment