Sunday, April 10, 2022

2058

2058
తెలుగు రచన
30/03/2022
============================
ఎవరు నీవు నా ఎదలో అలజడింత రేపేవు
కన్నులలో జేరి నీవు నిదురనెళ్ళగొట్టవు
ఉండి కూడ లేనట్టే నన్ను నీవు చేసావు
ఉన్నపాటినీ నాలో ఇన్ని మార్పులిచ్చేవు

నిదురున్నా మేల్కొన్నా పెద్ద మార్పు లేదులే
ఎదురుగా ఎందరున్న అందరిలో నీవేలే
ఒంటరిగా నేనున్నా వెంట నీవు ఉన్నట్టు
వింత మాయలేవేవో ఇంతలోనె క్రమ్మినట్టు

ఏమిటో ఈ వింత ఎవరు నీవు ఎవరంట

కారు మబ్బులన్ని పుణికి కొప్పున నీవల్లుకుని
వెన్నెలమ్మ అందాలను ఒళ్ళంతా పులుముకుని
కన్నె త్రాచు నడక లాగా కదలాడే  అడుగులతో
మదిలో నువ్ మ్రోగించే  మన్మోహన్ రాగాలు

ఇంతకీ ఎవరునీవు   ఏమిటీ ఈ వింత

ఉన్నట్టే ఉండి ఉండి ఉలికిపాటు ఇదేమి
పలుకరింపు లేకున్నా బదులు చెప్పుటదేమి
పరధ్యానమే ఎపుడూ పలుకరించినా నచ్చదు
నిప్పులపై నడవడం నీటిపై తేలడం
నాకిప్పుడు గొప్పకాదు  ఎప్పుడిలా అవ్వలేదు

ఏమిటో ఈ వింత ఎప్పుడూ లేదింత

ఇంతకీ ఎవరు నీవు అలజడింత రేపేవు
తొలకరిలో జల్లులాగ నన్ను తడిపివేశావు
పులకింతలు గిలిగింతలు  ఎన్ని ఎన్ని తుళ్ళింతలు
ఇన్ని ఇన్ని, ఇన్ని వింతలా మరెన్ని వింతలా!?
=============================
             య.వెంకటరమణ/..

No comments:

Post a Comment