Tuesday, April 7, 2015

నాకో ఉత్తరమొచ్చింది


                                                                                              దివి : 12/10/2014
                                                                                              స్థలం: గంటి 
" యామండి ! 
నేను గుర్తున్నానా? ఏం తప్పు చేసానని నన్నింత సులభంగా మరిచిపోయారు? మీ సుఖము, దుఖము, అన్నీ మీతో పంచుకుని ఎల్లప్పుడూ మీకు ఓదార్పుగా నిలిచిన నన్నింత తొందరగా మరిచిపోతారని నేననుకోలేదు. నేను పుట్టిందే మీకోసం.అలాంటి నన్ను మధ్యలో ఇలా వదిలేస్తే నాజీవితమేమైపోతుందో ఒక్కసారైనా ఆలోచించారా? మీకే చిన్న భాధ కలిగిన నాతో పంచుకుంటుంటే మీ కష్టాలకు నేనే ఓదార్పనుకున్నాను.మీ సంతోషాన్ని ముచ్చటపడి చెబుతుంటే అదంతా నామీద మీరు చూపే ప్రేమనే అనుకున్నాను. మీ సంతోషాన్ని నా సంతోషంగా భావించి, ఊర్లు దాటి మరీ ఆ విషయం వెల్లడించేదాన్ని, మీరు ఇబ్బందుల్లో ఉంటె, నానా అగచాట్లూ పడి,ఎక్కడికేక్కడికో  వెళ్లి , మీ ఇబ్బందికి పరిష్కారం తెచ్చేదాన్ని, అదే నా జన్మ సార్ధకం అనుకునే దాన్ని. నేను రావటం ఆలస్యమైతే మీరు పడిగాపులు పడి నాకోసం ఎదురు చూసే రోజులు గుర్తు చేసుకుంటే నేటికీ నా మనసు పులకించిపోతుంది.  అలాంటి నాకేందుకండి ఇంత దూరమైపోయారు..ఇప్పుడు మిమ్మల్ని చేరలేని నా జీవితం అగమ్య గోచరమైపోయింది. నా జీవితంలో అమావస్య  కారుమబ్బులు ఇప్పటికే అలుముకున్నాయి.ఇప్పటికీ మీరు నన్ను చేరదీయకపోతే, ఆ చీకటిలో నేను శాశ్వతంగా కనుమరుగైపోతాను.
మీరీ మధ్య ఓ వగలమారిని వెంటేసుకు తిరుగుతున్నారని నాకుతెలుసు. రాత్రి పగల ఒక్క గంట కూడా వదలకుండా ఉంటున్నరట. అది మీ ఇష్టం.మీరు తనతోనే ఉండండి. వద్దనటానికి నేనెవర్ని? 
అయితే, మీ క్షేమాన్ని కోరుకునే దానిగా తనగురించి మీకు చెప్పటం నా భాద్యత.ఆమె మీ చెక్కిలి నిమురుతూ చెవిలో చెప్పే గుస గుసలకు మురిసిపోతున్నారు కదా?. ఆమె చెప్పేమాటలన్నీ నిజాలు కాదు. నిజానికి తనేం చెబుతుందో మరు క్షణమడిగితే తనకు గురుతుండవు. నాకు ల ఏళ్ళ తరబడి గుర్తుంచుకునేటంత గొప్ప ప్రేమ కాదండి తనది.అంతే కాదు మీకు చెప్పే ప్రతి మాటకు తను లెక్కలు వేసుకుంటుంది. రకం వసూలు చేస్తుంది. ఈ జేబులు ఖాళీ చేయాలనే చూస్తుంది. అంతే కాదు తనదగ్గర బోలెడు రోగాలున్నాయి. వాటిని ఇప్పటికే చాలా వరకూ మీకంటించిది. తన ఆయుస్సెలాగూ అంతంతమాత్రమే. తను పోయేది గాక , మిమ్మల్ని కూడా అనారోగ్యంపాలు చేయాలని చూస్తుంది.అది నాకులా రూపాయికీ, పావలాకి పనిచేసే రకం కాదు. తను పెద్ద వ్యాపారి.కావాలంటే కొంతకాలం తనకేమి పెట్టటం మానేసి చూడండి.మీరు తనకేమి ఇవ్వటం లేదని గ్రహించిన మరుక్షణం. మూతు ముడుసుకుని మూలాన కూర్చోక పోతే నన్నడగండి. దానికి లెక్కలెక్కువ.తను చేసే ప్రతి పనికీ వెల కావాలి.లేదా తన పేరున డిపోజిట్లైనా చేసుండాలి. 
తియ్య తియ్యని ఆమె కబుర్లకు మీరు మురిసిపోతున్నారే కాని ఇవన్ని మీరు గ్రహించటం లేదు.ఆ వగలాడిని నమ్మకండి. నష్టపోకండి. నేనున్నాను. నన్ను గుర్తు చేసుకోండి. నేనెప్పుడు మీకోసమే. హా ఆ దేవుడు నాకు మాటలివ్వలేదు. తనలా హోయలోలకబోయడం నాకు రాదు.ఇదేనా నా తప్పు.విధిని ఎదిరించి నేను కూడా మీకలాంటి ముచ్చటలు ఎలా చెప్పగలను.
ఇప్పటికైనా మించిపోయిందేమి లేదు. రండి . నేను మీకోసమే ఉన్నాను. మీరుంటున్న ఊర్లోనే ఉంటున్నాను. నా పెదిరకాన్ని చూసి నాకో పాత ఇల్లు ఇచ్చారు. అందులోనే ఉంటున్నాను. ఒక జీతగాడున్నాడు. పాపం ఉదయం నుండి సాయంతం వరకూ నన్ను కనిపెట్టుకునే ఉంటాడు. అతని సంరక్షణలోనే ఉంటున్నాను.
మీరంటే నన్ను గుర్తించలేకపోయారు కాని. ఊరు ఊరంతా నన్నెరుగుదురు. నా పేరు చెప్పి , ఎక్కడుంటుందని ఎవరిని అడిగినా యిట్టె చెప్పేస్తారు. మా ఇంటిముందు ఒక ఎర్రటి డబ్బా ఉంటుంది. అదే నా ఇంటి గురుతు. లోపల అయన ఉంటారు. ఆయన మీకోసమే కనిపెడుతున్నారు. ఆయన్ని అడగండి. ''ఉత్తరం ఉందా " ని . వెంటనే నన్ను మీ ముందుకు తెస్తాడు. చీకటి పడిన తర్వాత గాని రాకండి సుమీ. ఎవరన్నా చూస్తే తప్పుగా అనుకుంటారు.ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఐదు గంటల మధ్యలో ఎప్పుడైనా రండి. వస్తారు కదూ?

ఇట్లు 
మీ రాకకై ఎదురు చూసే 

" ఉత్తరం"
*******

No comments:

Post a Comment