Monday, March 26, 2018

చల చల్లని వెన్నియలు

1588
తెలుగు రచన
18/11/2017
=================
చల చల్లని వెన్నియలు
తియ తీయని తేనియలు
మధురమెంత మధురము
కుసుమాలా ఈ సొగసులు

పిల్లగాలి కొలను జేరి
కొండ కోన వంత గలిపి
ఎంత మధుర ఆలపం
ఎంత మధురమీ సమయం

వడి వడి మేఘమాల
ఎటులమ్మా నీ పయనం
తళుకు తార బిక్క ముఖం
మిళుకు మిళుకులాడెను

ఈ తుంటరి జాజి కొమ్మకు
ఏమి తెలిసెనేమో ఏమో
తుళ్ళి తుళ్ళి నవ్వసాగెను
మళ్లీ మళ్లీ నన్నే చూసును

గుప్పుచిప్పు గోదారమ్మా
వెండి చీర గట్టిందా
గట్టుమీద కోకిలమ్మ
కొమ్మలెక్కి పాడనుందా

ఏమో ఏమో ఇంతందం
నిన్నకూడా ఉందో ఏమో
కొంటె మామ కబురు దెలిసి
నేడు నాకు ఇంపో ఏమో

సిగ్గులెంత గప్పుకున్నా
కొంటె పైట నిలువదేమి.
కంటిమీద కునుకు లేదు
మామ కెదురు వెళ్లిందేమి!

ఎంతసేపు ఓపాలింకా
ఎంగిలంటు దాచాలింకా
దోర దోర జామపండు
చిలక ముందు ఎన్నాళ్లింకా

అందమైన రాతిరి వేళ
సద్దు మణిగందరు ఉంటే
కన్నె పిల్ల కొప్పునపూలు
కన్నుగీటి నవ్వులు ఏమో

ఏమో ఏమో ఇదేనేమో
వలపుకు ఇది తొలకరేమో
మెలికలు ఈ మేనుకు
మెరుగుల సరి మొగ్గలేమో

ఏమో ఏమో ఇంతందం
నిన్నకూడా ఉందో ఏమో
కొంటె మామ కబురు దెలిసి
నేడు నాకు ఇంపో ఏమో
=================
...యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment