Sunday, March 6, 2022

2052

2052
తెలుగు రచన
22/02/2022
=================
చీకటి అంచులపై
రేపటి వెలుగులకై
తడబడు అడుగులతో
తరగని పయనంలో
తడిచిన కన్నులతో
మేచక దారులలో
గమ్యం వెతుకుతు
పడుతూ లేస్తూ
పడుతూ లేస్తూ
పరుగులు తీస్తూ
తరగని గమ్యం
తలపై మోస్తూ
మన వెనుకెనుకే
వస్తున్నా రొస్తున్నారరిగో
ఆకలి మనుషులు
ఆఖరి మనుషులు
ఆసర లేని ఆశా జీవులు
వస్తున్నారొస్తున్నారరిగో
బ్రాహ్మ రాతలో అచ్చుతప్పులు
బడలిన బ్రతుకుల భాగ్యజీవులు
స్వేచ్చే ఎరుగని స్వతంత్ర పౌరులు
వస్తున్నారొస్తున్నారరిగో
ఆఖరి మనుషులు ఆకలి మనుషులు
ఆకలి మరిగిన అన్నదాతలు
దాహం మరిచిన దమన జీవులు
వస్తున్నారొస్తున్నారరిగో
దారిపొడుగునా ముల్ల కంపలు
గోతులు గొప్పలు అరిగిన కాళ్ళు
అరుపులు బొబ్బలు వినేటివాళ్ళు
లేనే లేనీ చీకటి దార్లు
మర'లే లేని మరో యంత్రమై
మచ్చుకు లెక్కకు మనిషిగ బ్రతికే
మనుషులు మరిచిన మనుషులు
పాపం, వస్తున్నారొస్తున్నారరిగో
ఆఖరి మనుషులు ఆకలి మనుషులు
ఆకలి మరిగిన అన్నదాతలు
దాహం మరిచిన దమన జీవులు
వస్తున్నారొస్తున్నారరిగో
=====================
య. వెంకటరమణ/ .

No comments:

Post a Comment