1798
తెలుగు రచన
01/09/2018
====================
శివుని వెతకంగ నేను, చిత్రాడ వెళ్ళాను
చిత్రాడ వెళ్ళాను, శివపురికి వెళ్ళాను
శివపురికి నేను,శివకాశీ నేనూ శ్రీశైలమేగేను
హిమకుండు కైలాశ మెగిరెగిరి చూసేను
శివుడు లేడాడ, సిత్రాలు లేవాడ
చిత్తమెరుగగ బట్టి చీమనడిగేనేను
చెట్టునడిగే నేను, పుట్టనడిగే నేను
శివుడేడ చెప్పనుచు మొక్కి అడిగే నేను
చిన్న నవ్వు నవ్వి సిగ్గు పడుతూ చీమ
జగమంత శివుడైతే జగము నీవైతే?
జగతినెఱిగిన శివుని నీవెరుగవదియేలా?
జగతినెఱిగిన శివుని నీవెరుగవదియేలా?
ఏల ఏలా మనిషి, నీ మనసు గుడి మూసి
మూసి ఉన్నా గుడికి తాళాలు వెతికేవు
ఏల ఏలా మనిషి, నీ మనసు గుడి మూసి
ఏకంగ కైలాస మెగిరెగిరి జూసేవు
వీచు గాలీ శివుడు గాచు ఎండా శివుడు
కింద నేలా శివుడు, పైన నింగీ శివుడు
నీది నాదీ లేదేది మనదేది నరుడా
మనది లేదేది ఈడా జగమంత శివుడే
శివుడు లోకమైతే శివుడేడ నరుడా
లోకమెల్లా శివుడైతే వెతికేవు నీవేడ
చిత్తమెరిగీ నీవు శివుని నీలో చూడు
లోపలున్నా శివుని లోకానికే చూపు
శివుని వెతకంగ నీవు చిత్రాడ వెళ్ళేవు
చిత్రాడ వెళ్ళేవు, శివపురికి వెళ్ళేవు
శివపురికి నీవు,శివకాశీ నీవు శ్రీశైలమేగేవు
హిమకుండు కైలాశ మెగిరెగిరి చూసేవు
శివుడు లోకమైతే శివుడేడ నరుడా
లోకమెల్లా శివుడైతే వెతికేవు నీవేడ
చిత్తమెరిగీ నీవు శివుని నీలో చూడు
లోపలున్నా శివుని లోకానికే చూపు
====================
యలమంచిలి వెంకటరమణ
No comments:
Post a Comment