1850
తెలుగు రచన
28/06/2019
======================
సమాజమా నీకిది సమంజసమా
సర్దుకుపోయే గుణం నీ వారసత్వమా
గొప్పులెక్కలేవు గోయి దూకలేవు
నిప్పుదొక్కలేవు (నిజం నిప్పులాంటిది)
నిప్పుదొక్కలేవు నీటినోర్వలేవు(నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు)
నిప్పుదొక్కలేవు నీటినోర్వలేవు
ఎదురీతకు చేపవు గావు
వడిలో కొట్టుకుపోతూ మురిసిపోయే
సమాజమా నీకిది సమంజసమా
అడవిమృగాలు జనంలో తిరుగుతుంటే
జనం నీవై ఎడారిపాలవుతున్నావు
ఎండమావికై పరుగులుదీస్తూ
ఇసుకదెన్నుల నెందుకో నిందిస్తావు
సమాజమా నీకిది సమంజసమా
అవస్థ నీదీ, వ్యవస్థ నీదీ
సమస్తామంతా నీవేనీవై
నిన్నే నువ్వు నిందిస్తావు
సమాజమా నీకిది సమంజసమా
గర్జించే సింహం నీవూ
గగనంలో మెరుపువు నీవు
పిడుగుపాటు పిడికిలి నీదీ
అయినా అంతే బురదపాము పడగే నీది
సమాజమా నీకిది సమంజసమా
కళ్ళు మూసుకుపిల్లి పాలుత్రాగుతుంటే
కళ్ళజోడుకు ఆవిరిపడుతూ
ఎంతకాలం నీవురుగప్పిన నిప్పవుతావు
చెదలు గొట్టిన సూక్తవుతావు
సమాజమా నీకిది సమంజసమా
ఎర్ర పొద్దుతో పరుగులుదీస్తావు
పొద్దుగూకితే చతికిలబడతావు
నీ మతిమరుపు మండా
ఇంకెప్పుడు నీ దీపం ముట్టించుకుంటావు
పదునైన ఆయుధాలు పక్కనబెడతావు
మంత్రఖడ్గానికి బానిసగా ఎన్నాళ్ళుంటావు
నీ మయమరుపు మండా
నిన్న మరిచి రేపటికోసం వేచిఉంటావు
సమాజమా నీకిది సమంజసమా
రేవులో బండగా ఎన్నాళ్ళుంటావు
నీ కోట గోడగా నువ్వెప్పుడు నిలబడతావు
ఇప్పటివరకూ నువ్విలా సర్దుకుపోతావు?
======================
యలమంచిలి వెంకటరమణ
No comments:
Post a Comment