Friday, July 5, 2019

1856

=====================
దిగజారిపోతూ నాకు నేను
అగుపిస్తున్నాను ఎగతాళి చేస్తూ
నా భవిత నాకు అగుపిస్తుంది
మీకు మీ దారులు చూపిస్తూనే
నా వెలుగు ఆరిపోతోంది
వీధి స్తంభాల పై విద్యుత్తు దీపాలు
వెళుతున్నాయ్ ఇప్పుడు
అందరి వేగం బాగానే పెరిగింది
ఇప్పుడు నా గురించి నే
నేమి చెప్పుకున్నా పరిహాసమే
ఇంకా నాఅవసరముంటుందనుకోవడం
మరీ హాస్యం నన్ను తొక్కుకెళుతూ
అదిగో నా జనం కనబడుతున్నారు
నా వెలుగులో నిన్నింత జేశానంటే
నువ్వు నవ్వుతావు
అదిగో ఆ వాళ్ళూ నవ్వుతారు
ఎందుకో తట్టుకోలేకవుతున్నాను
వీధస్తంభల మిరుమిట్లు గొలిపే
ఈ విద్యుత్తు వెలుగులో బహుశా
నిన్ను చూసి నాకు ఈర్ష్య కలుగుతుందేమో
నా అహంభావం ఇంకా
ఆ వెలుగు రేఖల్ని మరువకుందేమో
కాదు.బహుశా  అది నిజం కాదేమో.
నా పొగలో నీ కన్నులు
మసకబారిపోతున్నాయేమో
ఇంకెంత.నా తైలం చివరిదశలో ఉంది
కొనఊపిరి ఇదిగో ఈ వెలుగులా ప్రసరిస్తుంది
అయ్యో.. నేను ఉండి నీకేమి చేయగలను.
నా ఉనికి నీకు చిన్న చూపు
నా వెలుగు నీకు కంటి వాపు
వెనక్కి తిరిగి కొంచెం గాలూదుతావా
వద్దులే .. నీ ఊపిరి అలిసిపోతుంది
నేనుంటాలే .నీవు ముందుకు సాగు
ఎప్పుడన్నా వెనక్కి రావాల్సి వస్తే
నీకోసం వెలగడానికి నేను సిద్ధంగా ఉంటాను..
నేను సిద్ధంగా ఉంటాను.. ఉంటాను.
ఉండనిస్తే నేనుంటాను.
వృధా అనుకుంటే ఇక నేనుంటాను.
=====================

No comments:

Post a Comment